ఈ ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ వీడియోల్లో ఆ విజువలైజేషన్, ఆ ఊదరగొట్టే మాటలు, మ్యూజిక్ కి మెల్ట్ అయిపోయి, అందరూ వెళ్తున్నారని, అక్కడేదో ఉందని ఒక హై లో వెళ్లి అలాగే ఆ హై లో వచ్చేస్తారు చాలామంది. కానీ నిజంగా ఏం ఫీలయ్యారంటే నూటికి 80 శాతం మందికి ఏ ఫీలింగూ రాదు. అలా చెబితే బాగుండదని.. ఓహో భలే ఉంది. అద్భుతం అని అనేస్తుంటారు. టూరిజం వెళ్లే చాలామంది పరిస్థితి ఇదే. అందుకే వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ విషయంలో జనాలకు ఆ ఫీలింగ్ ఉండకూడదని ఉన్న నిజాలే చెబుదామని అనిపించి ఈ కథనం రాస్తున్నా. గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్లినప్పుడు మీ మనసుకి ఫ్రెష్ ఫీలింగ్ కలగాలని, మీరు అనుభూతి చెందాలనేదే ఈ స్టోరీ లక్ష్యం.
గ్లాస్ బ్రిడ్జ్ ఎందుకు అంటే భయం కలగడానికి.. కిందకు చూస్తే కళ్లు తిరిగిపోయేంత లోతు పైన ఆకాశం, ఆ మధ్యలో నడుస్తుంటే చిన్న సాహసం చేస్తున్న ఫీలింగ్. కిందంతా పారదర్శకం.. ట్రాన్సపరెంట్ కాబట్టి గాళ్లో నడుస్తున్నామా.. అనే అనుభూతి. ఇవన్నీ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ కు ఉన్నాయా.. అంటే చాలామంది పర్యాటకులు.. నో చెబుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. బలంగా కట్టిన ఇనుప తాళ్లు కనిపిస్తుంటే, కింద స్ట్రాంగ్ గా ఐరన్ బేస్ కనిపిస్తుంటే చాలామందికి అంత భయం అనిపించడం లేదు. దానికి తోడు ఈ రెండు రోజులు వర్షం పడుతుండటం వల్ల గ్లాస్ నుంచి కిందకు వ్యూ సరిగా కనిపించడం లేదు. దీంతో పెద్దగా ఎవరికీ భయం గలగడం లేదు. ఇది కాంటీలీవర్ బ్రిడ్జ్ కాబట్టి 55 మీటర్లు దేశంలోనే పొడవైన బ్రిడ్జ్ అయినా.. ఇంత దూరంలో ఈ మధ్యలో ఒంటరిని అనే ఫీలింగ్, ఏమైనా జరిగితే.. అమ్మో అనే ఫీలింగ్ రావడం లేదు.
అలా అని ఈ గ్లాస్ బ్రిడ్జ్ ను చూడాల్సిన అవసరం లేదా.. అంటే కచ్చితంగా ఉంది. దానికీ కారణాలు ఉన్నాయి. తొలి కారణం ఏంటంటే.. నడుస్తున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ చివరికి వెళ్లేసరికి.. అంటే ఈ డైమండ్ షేప్ దగ్గరకి వచ్చేసరికి ఒక్కసారిగా లైట్ జర్క్ ఇస్తుంటుంది ఊగుతున్నట్టుగా. ఆ ఆలోచన లేనివారికి ఒక్కసారిగా గుండెలు ఒక్కసారి కిందకు జారి సెట్టవుతాయి. ఎవరో ఊపుతున్నారేమో అని చుట్టూ చూస్తాం.. ఊపకండి అని అరిచేవాళ్లూ కనిపించారు. అ ఎఫెక్ట్ రావడానికి చాలా కష్టపడ్డాం.. అంటున్నారు ఇక్కడి ఇంజనీరింగ్ బ్రుందం.
ఇక రెండో అంశం వ్యూ.. కొండ నుంచి అంత దూరం నడిస్తే కనిపించే వ్యూ చాలా బాగుంది. వెనక్కు చూస్తే కైలసగిరి అందాలు, మన నేల కిందా, రెండు పక్కలా చిక్కని అడవి, ఎదురుగా కైలాసగిరి వంపులు తిరిగిన రోడ్డు, మహా సముద్రం కెరటాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. ఎత్తులంటే భయపడేవాళ్లకు ఏక్రో ఫోబియా ఉన్నవాళ్లకు ఇది మంచి ఫీలింగ్ ను ఇస్తుంది.
చైనాలో గ్లాస్ బ్రిడ్జెస్ లో కొన్ని క్రాకింగ్, బ్రేకింగ్ ఎఫెక్ట్ తో ఉంటాయి. అంటే నడుస్తున్నప్పుడు మన పాదం పడగానే క్రాక్స్ వచ్చేట్టు, భళ్లున పగిలేట్టు శబ్ధం రావడం, ఎఫెక్ట్ కనిపించడం. అవి పగలవు గానీ నడుస్తున్నవాళ్లకు మాత్రం పగిలిపోయాయేమో అనే భయం వచ్చేస్తుంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ అనగానే చాలామంది అలా ఉంటుందేమోఅని ఆశిస్తారు. కానీ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ కు ఆ ఎఫెక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
మనం సోషల్ మీడియాలో చూసేంత హై లో ఊహించుకొని వస్తే నిరాశపడే అవకాశం ఉంది కాబట్టి మీకు ముందుగా ఇదంతా చెబుతున్నాను. అలా అని ఇదేమైనా తక్కువనా.. అంటే కైలాసగిరికి ఎందుకు వెళ్లాలి అంటే కచ్చితంగా ఇదే ప్రధాన కారణమవుతుంది అని చెప్పొచ్చు. ఆ మాట కొస్తే వైజాగ్ టాప్ 10 ప్రత్యేకతల్లో గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఒకటిగా నిలిచే అవకాశం లేకపోలేదు.
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఎలా ఉంది? Vizag glass bridge in Kailasagiri